ఇక కేబుల్ ద్వారా మన టీవీ

ఇక కేబుల్ ద్వారా మన టీవీ

-ప్రసారాలకు ఎమ్మెస్వోల అంగీకారం
-రేపటినుంచి అందుబాటులోకి మనటీవీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనటీవీ చానెల్ ప్రసారాలు ఇక కేబుల్ ద్వారా అందరి అందుబాటులోకి వస్తున్నాయి. మనటీవీ చానెల్‌ను కేబుల్ ద్వారా ప్రసారం చేసేందుకు రాష్ట్ర ఎమ్మెస్వోలు అంగీకరించారు. హైదరాబాద్‌లోని మనటీవీ కార్యాలయంలో శనివారం ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, మనటీవీ సీఈవో శైలేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్రంలోని పలువురు ఎమ్మెస్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ సూచన మేరకు మనటీవీ ప్రసారాలను చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెస్వోలకు సహకారం అందించేందుకు ఐటీ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలోని నిరుద్యోగ యువతను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంలో భాగంగా విద్యార్థి, యువతకు ఉపయోగపడే పాఠ్యాంశాలను మనటీవీలో ప్రసారం చేయనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. ఇంతేకాకుండా వ్యవసాయం, మహిళలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మనటీవీ ద్వారా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఎమ్మెస్వోల సహకారం తీసుకోవాలని మంత్రి కేటీఆర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

manatv
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకానికి మనటీవీ ప్రసారాలు అందించేందుకు ఎమ్మెస్వోలు ముందుకు వచ్చారు. సోమవారం నుంచి మనటీవీని అందరి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 60 ఎమ్మెస్వో లు, 15,000 లోకల్ ఎంఎస్‌ల ద్వారా సుమారు 90 లక్షల కుటుంబాలకు కేబుల్ ప్రసారాలను అందిస్తామని ఎమ్మెస్వోల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆయా సంఘాల ప్రతినిధులు ఎం సుభాష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఫణికృష్ణ, ఇంతిహాజ్, శివరామకృష్ణ మనటీవీ చానెల్ ప్రసా రాలకు అంగీకరించడం పట్ల ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్, మనటీవీ సీఈవో శైలేశ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

-సోషల్ మీడియాలో మనటీవీ లింక్‌లు: WWW.FACEBOOK.COM/MANATVHYD
WWW.TWITTER.COM/MANATVHYD