డిజిటల్ పాఠాలకు టీవీ చానెల్!

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతుల బోధనకు ప్రత్యేక టీవీ చానెల్ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ‘మన టీవీ’ ద్వారా విద్యా కార్యక్షికమాలు నిర్వహిస్తూ వచ్చిన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇక శాటిలైట్ ద్వారా పనిచేసే ప్రత్యేక టీవీ చానెల్ ఏర్పాటుచేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగళవారం నిర్వహించిన సమీక్షలో చర్చించినట్లు తెలుస్తున్నది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి కేంద్రం అనుమతికి పంపాలని అధికారులను ఆయన ఆదేశించారని కూడా విశ్వసనీయ సమాచారం.

తదనుగుణంగా ఈ చానెల్‌కు అనుమతిపై కేంద్రంతోనూ చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ప్రసారభారతి’ ఆధ్వర్యంలో సాగుతున్న దూరదర్శన్ ద్వారా రాష్ట్రంలో ప్రత్యేక ఎడ్యుకేషన్ టీవీ ఏర్పాటు చేయాలని భావించినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ‘ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు’ అనే అంశంపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం డిప్యూటీ సీఎం కడియం సమీక్షించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్, ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మైనారిటీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఉమర్ జలీల్, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ జగన్నాథ్‌డ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్న డిజిటల్ పాఠాలు అక్టోబర్ 14 నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

తొలుత 1,000 ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించి, దశల వారీగా మిగతా పాఠశాలలకు కూడా విస్తరించాలనుకున్నారు. అదే క్రమంలో రాష్ట్రంలో 2,680 ఉన్నత పాఠశాలల్లో టీవీలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో మనటీవీ ద్వారా ప్రసారాలు చేయాలని చర్చించారు. లేదంటే సీడీలు, ప్రొజెక్టర్ల ద్వారా విద్యార్థులకు అందుబాటులో డిజిటల్ పాఠశాలల్లో అందుబాటులోకి తేవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్ణయం తీసుకున్నారు. ‘మన టీవీ’ ఆధ్వర్యంలో డిజిటల్ పాఠాల కంటెంట్ ఎంపిక జరుగుతుందని, ఈ నెల 15 నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేసి, తిరిగి ఈ నెల 19 మరో సారి సమావేశం కావాల్సి ఉందని డిప్యూటీ సీఎం కడియం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.