ప్రజల చానల్‌గా ‘మనటీవీ’

ప్రజల చానల్‌గా ‘మనటీవీ’

ktrao

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపే మనటీవీ చానల్‌ను ప్రజలంతా వీక్షించే చానల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. కేబు ల్ టీవీ ద్వారా ఇంటింటికీ మనటీవీ ప్రసారాల కోసం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ఐటీశాఖ, ఇస్రో మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఇస్రో డైరెక్టర్ వీరేంద్రకుమార్ సింగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానంలో ప్రపంచవ్యాప్తం గా భారతదేశ సత్తాను చాటి చెప్తున్న ఇస్రో, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరమన్నారు. 90 లక్షల గృహాలకు మనటీవీ చేరువవుతుంది. తెలంగాణలో పెద్ద ఎత్తున ఉన్న ఉద్యోగార్థులకు మనటీవీ ద్వారా కోచింగ్ సామగ్రి అందించడం సంతోషకరం. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు లైవ్, రికార్డింగ్ సమాచారం రూపంలో ఇవ్వడం ప్రశంసనీయం.

-రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్
-ఇస్రోతో మనటీవీ ఒప్పందం
-వచ్చేనెల ఒకటో తేదీ నుంచి గ్రూప్ -2 కోచింగ్
-తెలంగాణకు అండగా నిలుస్తాం: ఇస్రో

గ్రూప్స్‌తోనే ఆపివేయకుండా ఎంసెట్, సివిల్స్ తదితర పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇవ్వాలి అని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నది. వచ్చేనెల 14 నుంచి రాష్ట్రంలోని 6000 స్కూళ్లల్లో బోధనకు డిజిటల్ పాఠ్యాంశాల రూపకల్పనలో ఇస్రో తోడ్పాటునిస్తుంది. నగరాలకు వరదలు వచ్చినప్పుడు సహాయ, పునరావాస చర్యల సమన్వయం కోసం నా ఆధ్వర్యంలోని మున్సిపల్‌శాఖ కూడా ఒప్పందం కుదుర్చుకునేలా నిర్ణయం తీసుకుంటాం అని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వోద్యోగాల నియామకాలకు ఏర్పాటైన టీఎస్‌పీఎస్సీ పనితీరును ప్రశంసించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత భారీగా జరిగిన నియామక ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో పూర్తి పారదర్శకంగా వేగంగా పూర్తిచేసింది. ఇతర రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఆదర్శంగా నిలిచిన కమిషన్.. అన్ని వర్గాల్లో పొందిన విశ్వాసాన్ని కొనసాగించాలి అని ఆకాంక్షించారు. ఇస్రో వీరేంద్రకుమార్ సింగ్ మాట్లాడుతూ అంతరిక్ష సాంకేతిక విజ్ఞానంతో సమగ్ర అభివృద్ధి సాధించాలన్న తెలంగాణ సర్కార్ ఆలోచనకు అండగా ఉంటామన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ క్షేత్రస్థాయికి మనటీవీ సేవలను విస్తరించాలన్నారు. మనటీవీ సీఈవో శైలేశ్‌రెడ్డి మాట్లాడుతూ నిపుణులైన ఫ్యాకల్టీతో ప్రసారాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో డైరెక్టర్ విష్ణుమూర్తి, ఐటీ శాఖ డైరెక్టర్ కొణతందిలీప్ తదితరులు పాల్గొన్నారు.

ఆపరేటర్ల ద్వారా ప్రసారాలకు చర్యలు తీసుకోండి

మన టీవీ ద్వారా ఇచ్చే కోచింగ్ సమాచారాన్ని ఉద్యోగాల కోసం దరఖాస్తుచేసుకున్న అభ్యర్థులకు చేరవేసేందుకు కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోల సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ విషయమై ఎంఎస్‌వోలతో సమావేశమై ప్రభుత్వం తరఫున జీవో జారీకి చర్యలు తీసుకోవాలని ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, మనటీవీ సీఈవో శైలేశ్‌రెడ్డికి సూచించారు. సోషల్‌మీడియా ద్వారా మనటీవీని అర్హుల చేరువలోకి తీసుకెళ్లాలన్నారు. దీనిపై శైలేశ్ రెడ్డి స్పందిస్తూ ఎంఎస్‌వోలతో వచ్చేనెల ఒకటో తేదీన సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎంసెట్ కోచింగ్‌పై కసరత్తుచేస్తామని తెలిపారు.
మనటీవీ సోషల్ మీడియా వివరాలివి:FEEDBACK.SOFTNET@TELANGANA.GOV.IN
హెల్ప్‌లైన్ నంబర్: 7337558051 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు)