మనటీవీలో గ్రూప్-2 కోచింగ్

మనటీవీలో గ్రూప్-2 కోచింగ్

-త్వరలో అన్ని పరీక్షలకూ శిక్షణ
-పాఠాల ప్రసార వేళలతో ఎస్‌ఎంఎస్‌లు
-ప్రసారమైన పాఠాలు యూట్యూబ్‌లో దేశంలోనే మొదటిసారిగా ప్రయోగం

mana-tv
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అవకాశాలున్నా అందిపుచ్చుకునే ఆర్థిక వనరులు లేని గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రయోజనంకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆలోచిస్తున్నది. నిత్యజీవితంలో భాగమైపోయిన టెలివిజన్‌ను ఉపయోగించుకుని గ్రామీణ విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చేందుకు ఐటీ మంత్రి కేటీ రామారావు ప్రణాళికలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మన టీవీని ఇందుకు ఉపయోగించుకోనున్నారు. దేశంలోనే మొదటిసారిగా టెలివిజన్‌ద్వారా పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడే పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు. ఇప్పటిదాకా మన టీవీ నామమాత్రపు ప్రసారాలకు పరిమితమైందనే అపప్రథను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితం మంత్రి కేటీఆర్ దీనిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు శైలేశ్‌రెడ్డిని మన టీవీ సీఈవోగా నియమించి.. దానిని విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పూర్తిస్థాయిలో చేరువ చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా పలు దఫాలుగా అధ్యయనం చేసిన సీఈవో.. తాజాగా జరుగుతున్న గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మేలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టును సిద్ధం చేశారు.

దీని ప్రకారం మన టీవీద్వారా గ్రూప్స్ పాఠ్యాంశాలను వీడియోల రూపంలో ప్రసారం చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే నిపుణులైన ఫ్యాకల్టీతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. గ్రూప్-2 పరిధిలోకి వచ్చే సిలబస్‌ను వారు బోధిస్తుండగా రికార్డుచేసి.. వాటికి తగు వీడియో చిత్రాలు, ఇతర వివరాలను జోడించి.. ప్రసారం చేస్తారు. వీటిని ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ హైస్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న మన టీవీ రిసీవర్ల ద్వారా అందిస్తారు. ప్రతిరోజూ ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.. ఆయా సబ్జెక్టులపై ప్రసారాలుంటాయి. ఈ విషయంలో సమస్యలు ఎదురుకాకుండా ఇప్పటికే విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖతో మన టీవీ సీఈవో చర్చించారని తెలిసింది. వారి ఆమోదం అనంతరం ఈ ప్రసారాలు వెంటనే మొదలవుతాయి. తరువాతి దశలో ఇతర పోటీ పరీక్షలకుసైతం టీవీ పాఠాలు ఉంటాయని చెప్తున్నారు.

యూట్యూబ్‌లో వీడియోలు.. ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు

మన టీవీలో ప్రసారమయ్యే పాఠాలపై ముందుగానే అభ్యర్థులకు సమాచారం ఇచ్చేలా మన టీవీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి మెజార్టీ ఫోన్ నంబర్లు కలిగి ఉన్న టీఎస్‌పీఎస్సీతో సమన్వయం చేసుకుంటున్నది. ఓటీఆర్ ద్వారా టీఎస్‌పీఎస్సీలో నమోదైన విద్యార్థుల సెల్‌ఫోన్ నంబర్లు సేకరించి వాటికి ఆ రోజు ప్రసారమయ్యే అంశాలు.. ప్రసార సమయాలను పేర్కొంటూ ప్రతిరోజూ ఎస్‌ఎంఎస్ పంపిస్తారు. ఏదైనా కారణాలతో ఆయా కార్యాలయాల్లో, నియమిత వేళల్లో ప్రోగ్రాంలను చూడలేని వారికి ఇబ్బంది లేకుండా మన టీవీలో ప్రసారమైన పాఠ్యాంశాలను వెంటనే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసేందుకు మన టీవీ సీఈవో కసరత్తు చేస్తున్నారు. వీటిని WWW.YOUTUBE.COM/MANATV చానల్‌లో చూడవచ్చు. పరీక్ష తర్వాతి దశ అయిన ఇంటర్వ్యూను సైతం విజయవంతంగా ముగించుకునేలా మన టీవీ సహకరించనుంది.

మాక్ ఇంటర్వ్యూ (నమూనా ఇంటర్వ్యూ)ల రూపంలో అభ్యర్థులకు అవగాహన కల్పించి, వారిలో భయం పోగొట్టేందుకు సిద్ధమవుతున్నది. అభ్యర్థి ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టింది మొదలు నడక తీరు, ప్రశ్నలకు స్పందించే విధానం, గదిలో ప్రవర్తన, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలను సైకాలజీ నిపుణులు, సబ్జెక్ట్ నిపుణులు వివరిస్తారు. ఇదిలాఉండగా మన టీవీకి కొత్త పేరు సూచించి, బహుమతి పొందాలని చేసిన ప్రతిపాదనకు పెద్ద ఎత్తున స్పందన వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు మెయిల్ రూపంలో 150 మంది వివిధ పేర్లు సూచించారని తెలిసింది.