కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా రెండు విడతలుగా నిర్వహించే సి-టెట్ (సెంట్రల్ టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్) పరీక్షపై టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాయి. ఈ నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు టి-సాట్ నిపుణ ఛానల్ లో స్పెషల్ లైవ్ ప్రసారం కానుంది. సి-టెట్ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంపై టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులకు సి-టెట్ పై అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా రెండు విడతలుగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆఫ్ లైన్ ద్వార నిర్వహించే అర్హత పరీక్షను ఈ యేడాది అన్ లైన్ లో నిర్వహిస్తున్నందున టి-సాట్ అందించే అవగాహన కార్యక్రమం ఉపయోగంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే డి.ఎడ్., బి.ఎడ్., పూర్తి చేసిన సుమారు 4,00,000 మంది అభ్యర్థులు సి-టెట్ ఉత్తీర్ణత సాధిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆర్మీ, నవోదయ, సైనిక్ పాఠశాలల వంటి తదితర ఆరు పాఠశాలల్లో ఉద్యోగాలు పొందేందుకు అర్హత కలుగుతుందని శైలేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సి-టెట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలో నిర్వహించే డి.ఎడ్., బి.ఎడ్ అర్హత పరీక్షల్లోనూ వెయిటేజీ దక్కుతుందని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు టి-సాట్ అవగాహన ప్రసారాలను వినియోగించుకోవాలని సూచించారు. సి-టెట్ పరీక్షలు డిసెంబర్ 20వ తేదీ నుండి జనవరి 5, 2022 వరకు వివిధ స్థాయిల్లో నిర్వహించేందుకు తేదీలు నిర్ణయించగా, ఈ నెల 18వ తేదీ ధరఖాస్తుకు చివరి తేదీ అని చెప్పారు. అర్హత పరీక్షపై నిర్వహించే అవగాహన కార్యక్రమంలో వరంగల్ డైట్ రిటైర్డ్ లెక్చరర్ చెన్నాడి కేశవ రావు కార్యక్రమంలో పాల్గొంటుండగా సి-టెట్ ఇంగ్లీష్ విభాగం టాపర్ కె.హరిప్రియ, తెలుగు విభాగం టాపర్ మానస చర్చలో పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారని సీఈవో శైలేష్ రెడ్డి వివరించారు.