పత్రిక ప్రకటన 04.08.2021

పత్రిక ప్రకటన 04.08.2021

పోలీసు ఉద్యోగాల పోటీ పరీక్షలపై టి-సాట్ స్పెషల్ లైవ్

  • మూడు రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 53 రోజులు 212 గంటలు నిపుణ ఛానల్ లో ప్రతి రోజూ నాలుగు గంటలు అభ్యర్థుల ప్రతిభకు ఫ్రీ మాక్ టెస్ట్

-టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి (టి.సాట్-సాఫ్ట్ నెట్)

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భర్తీ చేస్తున్న పోలీసు ఉద్యోగాల పోటీ పరీక్షలపై టి-సాట్ ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసార కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. స్టాప్ సెలక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సి) ఆధ్వర్యంలో 25,271 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్న దృష్ట్యా తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతకు పరీక్షపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రసారాలు చేస్తున్నామన్నారు. ప్రసారాల్లో భాగంగా మూడు రోజుల పాటు లైవ్ ప్రసారాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు ఐదవ తేదీ గురువారం నుండి శనివారం వరకు మూడు రోజులు మధ్యాహ్నాం మూడున్నర గంటల నుండి నాలుగున్నర గంటల వరకు గంటపాటు ఇంగ్లీష్, జనరల్ ఇంటిలిజెన్స్, ఎలిమెంటరి మాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ సబ్జెక్టులపై అవగాహనా ప్రత్యక్ష ప్రసారాలుంటాయని సీఈవో స్పష్టం చేశారు.


53 రోజులు 212 గంటలు : సెంట్రల్ పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలపై ఆగస్టు తొమ్మిదవ తేదీ నుండి 53 రోజుల పాటు ప్రత్యేక ప్రసారాలుంటాయని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి తెలిపారు. జనరల్ ఇంటలిజెన్స్, ఎలిమెంటరీ మాథమెటిక్స్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, చరిత్ర మరియు పాలిటీపై ప్రత్యేక ప్రసారాలు సుమారు 212 గంటలుంటాయన్నారు. తెలంగాణ ప్రాంత అభ్యర్థుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలను తెలుగులో ప్రసారం చేస్తున్నామన్నారు. టి-సాట్ నిపుణ ఛానల్ లో సాయంత్రం ఏడు గంటల నుండి 11 గంటల వరకు ప్రతి రోజూ నాలుగు గంటలు ప్రసారాలుంటాయని, ఇవే ప్రసారాలు విద్య ఛానల్ లో మరుసటి రోజు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు రెండు గంటల పాటు ఉంటాయన్నారు. పోలీసు ఉద్యోగ నియామకాల అవగాహన ప్రసారాలపై పరీక్షలు రాసే అభ్యర్థులు తమ సందేహాలను 040-23540326, 23540726, టోల్ ఫ్రీ 18004254039 పోన్ నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు.


మాక్ టెస్ట్ : గతంలో జరిగిన పరీక్షలకు నిర్వహించిన మాదిరిగా కేంద్ర పోలీసు ఉద్యోగ నియామకాలకూ టి-సాట్ మాక్ టెస్ట్ నిర్వహిస్తుందని, అభ్యర్థులకు ఈ మాక్ టెస్టు ఫ్రీ ఫైనల్ టెస్టులా ఉపయోగపడనుందని సీఈవో గుర్తుచేశారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టి-సాట్ నెట్వర్క్ వెబ్ సైట్ www.tsat.tv లోని మాక్ టెస్టులో పాల్గొనాల్సి ఉంటుందని, తొంబై నిమిషాల సమయం కలిగిన ఈ పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులుంటాయని, తప్పుడు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కు ఉంటుందన్నారు. సమయం పూర్తవగానే అభ్యర్థి రాసిన ప్రశ్నలకు మార్కులు కాకుండా స్కోర్ రూపంలో ఫలితం వస్తుందని, మాక్ టెస్ట్ లో అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాల్లో తెలంగాణ ప్రాతినిద్యాన్ని పెంచాలని సీఈవో శైలేష్ రెడ్డి కోరారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *